Oct 09,2023 21:51

విద్యుత్‌ భారాలపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వామపక్ష పార్టీల నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజలపై భారం మోపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విద్యుత్‌ ఛార్జీల పెంపుదలను విద్యుత్‌ వినియోగదారులందరూ సమిష్టిగా ప్రతిఘటించాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్‌ ఛార్జీలు పెంపుదల, ప్రజలపై భారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యుత్‌ విధానాలపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నాడు అనంతపురంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పాతూరు బ్రహ్మంగారి దేవాలయం నుంచి మొదలైన ప్రచారాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాతూరు మార్కెట్‌, నీలంటాకీస్‌ సర్కిల్‌ వద్ద ప్రజలు, దుకాణదారులను కలిసి విద్యుత్‌ భారాల వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని తెలిపారు. ఒకేసారి సర్దుబాటు పేరుతో మూడు సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంపుదల చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ప్రజలకు విద్యుత్‌ షాక్‌ ఇస్తున్నాయని విమర్శించారు. గత సంవత్సరం రూ.1400 కోట్లు భారం మోపగా, తాజాగా రూ.6 వేల కోట్లు భారం వేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల్లో రూ.25 వేల కోట్లు ప్రజల నెత్తిన విద్యుత్‌ భారాలు మోపారన్నారు. ఈ నెల బిల్లులో 2014 సంవత్సరంలో వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌పై రూ.20 పైసలు, 2021 మే నెలలో వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.20 పైసలు, 2023 ఏప్రిల్‌ నెలలో వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌ 40 పైసలు కలిపి మొత్తం యూనిట్‌కు 80 పైసలు చొప్పున ప్రజలపై భారాలు మోపారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాలకు లొంగిపోయిన జగన్‌ ప్రభుత్వం ప్రతి నెలా వంట గ్యాస్‌ లాగానే విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమైన చర్య అన్నారు. విద్యుత్‌ బిల్లులే కాకుండా ఫిక్స్‌ ఛార్జీలు, కస్టమర్స్‌, సర్‌ ఛార్జీలు, విద్యుత్‌ సుంకం, సర్దుబాటు ఛార్జీలు ఇలా రకరకాల పేర్లతో భారాలను మోపడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు. విద్యుత్‌ రంగాన్ని అదానీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని చెప్పారు. విదేశాల బొగ్గు సరఫరా చేసేది, బొగ్గు రవాణా చేసే ఓడరేవులు అదానీవే అన్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్‌ మీటర్లు తయారు చేసే కంపెనీని అదానీ ప్రారంభించారంటే ఆయన గుప్పిట్లోకి విద్యుత్‌ రంగం ఎలా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. రూ.3కు కొనుగోలు చేయాల్సిన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.20 వెచ్చించి కొనుగోలు చేయడం దగా చేసేందుకే అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్‌ల లోపు విద్యుత్‌ వినియోగించే వారందరికీ ఉచిత విద్యుత్‌ అంటూ హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్‌ పథకాన్ని క్రమంగా నీరుగారుస్తున్నారని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్‌లు బిగించి ప్రజలపై స్మార్ట్‌గా భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ ఆదేశాలకు లొంగి విద్యుత్‌ రంగాన్ని మూడు ముక్కలు చేసి సంస్కరణ పేరుతో ఛార్జీలు పెంచితే ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కళ్లుతెరిచి విద్యుత్‌ భారాలను తగ్గించకుంటే ఆయన కూడా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వై.వెంకటనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, సిపిఎం నగర కమిటీ నాయకులు వలీ, రాజు, జీవా, వెంకటేష్‌, గపూర్‌, నాగభూషణ, బాబా, నారాయణ, ఆవాజ్‌ ఇస్మాయిల్‌, ప్రజానాట్య మండలి శీనా, రాముడు, ముసలప్ప, ఎన్టీఆర్‌ శీనా, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, ఇన్సాఫ్‌ నాయకులు బంగారు బాషా పాల్గొన్నారు.