విద్యుత్ ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలి- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు
గాలివీడు : విద్యుత్తు ట్రూ ఆఫ్ ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై బాదుడు ఆపాలని తెలిపారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.లక్షల కోట్లు ప్రజలపై భారాలు వేసే విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలన్నారు. రూ.18 లక్షల వ్యయంతో పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. గాలి, నీరు తర్వాత విద్యుత్తు ప్రజల నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. 1948 నుంచి విద్యుత్ కంపెనీ చట్టం, విద్యుత్ బోర్డు ఏర్పడి నో లాస్, నో గేయిన్ విధానంతో ప్రజలకు విద్యుత్తు సౌకర్యాలు, సేవా దక్పథంతో అందించాలన్నారు. మన దేశ రాజ్యాంగ నిర్మాతలు, సేవకులైన పాలకులు, ప్రభుత్వాలు నిర్ణయించారన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల ప్రయోజనాల కోసం 2003 సంవత్సరంలో విద్యుత్తు చట్ట సంస్క రణలు, పాలకులు స్వప్రయోజనాల కోసం తెచ్చారన్నారు. 2021లో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో రూ.3,669 కోట్లు ప్రజల నుంచి ప్రభుత్వాలు వాడిన విద్యుత్ ఛార్జీల కన్నా ఎక్కువగా వసూలు చేశారన్నారు. సెల్ ఫోన్ చార్జీల లాగా ముందే, విద్యుత్ సంస్థలకు డబ్బు చెల్లిస్తేనే, విద్యుత్ సౌకర్యం అందించే పూర్తిస్థాయి కార్పొరేట్ వ్యాపార పద్ధతిని, 2022 విద్యుత్ సంస్కరణ బిల్లు పార్లమెంటులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో, తీసుకొని వచ్చి ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధానం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిందని వారు విమర్శించారు. 2022 ఒక్క సంవత్సరంలోనే రూ.14 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నుంచి వసూలు చేశారన్నారు. దేశంలోని సుమారు రూ.18 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ, గ్రామీణ ఆహార ధాన్యాల ఉత్పత్తిదారులైన వ్యవసాయదారులపై కూడా విద్యుత్తు బిల్లుల చార్జీలు వేసి ప్రజాధనాన్ని దొడ్డిదారిన పాలక ప్రభుత్వాలు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పాలకులే నేరస్తులుగా మారుతున్న వైనం దేశంలో అలుముకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆదాని, అంబాని కార్పొరేట్ కంపెనీలు విద్యుత్తు రంగాన్ని కైవసం చేసుకుని, కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో విద్యుత్తు రంగాన్ని పెట్టుకుని, 80 శాతం, 90 శాతం శాతం లాభాలను ఆర్జించడానికి, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజా సంపదను, ప్రజాధనాన్ని, ప్రజా ప్రయోజనాలను, తాకట్టు పెడుతున్నదన్నారు. 2023లో ప్రజలపై రూ.3083 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడిందన్నారు. ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉఫాధ్యక్షులు ఎస్.ఓబులమ్మ, జిల్లా కమిటీ సభ్యులు జి.భోగేశ్వరయ్య, ఎం.లక్షమిదేవి, మండల అధ్యక్షులు ఎస్.భాస్కర్ పాల్గొన్నారు.










