ప్రజాశక్తి-సీతమ్మధార : విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెవిఎస్.కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 22 వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి డిమాండ్‌చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి, రైతన్నను ఆదుకోడానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతు నాయకులతో చర్చించకుండానే, సంప్రదింపులు జరుపకుండానే విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, మన రాష్ట్రంలో కూడా రైతులతో సంప్రదింపులు జరపకుండానే వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించి బిల్లులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ బిల్లును 11 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మి, కె.శంకరరావు, కె.కుమారి, రైతు సంఘాల నాయకులు ఎం.అప్పలరాజు, అజరుకుమార్, ఎ.ప్రకాష్, రాంబాబు, జి.నాయినబాబు, సిహెచ్.జగన్, జి.కృష్టంనాయుడు, ఎస్.గోపాల్ పాల్గొన్నారు.










