
ప్రజాశక్తి - భట్టిప్రోలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా శుక్రవారం ఐలవరంలో ర్యాలీ నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్ ) మురుగుడు సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, మర్రివాడ వెంకట్రావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసి బడా కంపెనీలకు లాభం చేకూరే విధంగా ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహ వ్యక్తం చేశారు. రూ.3కు కొనాల్సిన విద్యుత్తును బహిరంగ మార్కెట్లో రూ.10 నుండి రూ.20చొప్పున కొనుగోలు చేస్తూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 200యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచితంగా ఇస్తామని ప్రకటన చేసిన వైసిపి ప్రభుత్వం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దీపాల సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీ, దండు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అమీర్, జె కోటేశ్వరరావు పాల్గొన్నారు.