Oct 15,2023 00:20

గడియార స్తంభం సెంటర్లో విద్యుత్ బిల్లులు దగ్ధం 
ప్రజాశక్తి - చీరాల
పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకంగా సిపిఎం, సమజ్‌వాదీ పార్టీ, దళిత బహుజన రాజ్యం పార్టీ, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద శనివారం నిరసన ధర్నా నిర్వహించారు. విద్యుత్ బిల్లులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని అన్నారు. రాష్ర్టంలో విద్యుత్ బిల్లులు చూస్తే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లుని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ఆదాని కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. మీటర్ల తయారీ భారాన్ని కూడా వినియోగదారులపై మోపుతున్నారని అన్నారు. 2014నుంచి 2019వరకు వాడుకున్న విద్యుత్‌కు సర్దుబాటు చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ఇప్పుడు ప్రజలపై అదనపు బిల్లులను రుద్ది వసూలు చేస్తున్నారని అన్నారు. ఇది చట్టవిరుద్ధం అన్నారు. ఒకవైపు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలకు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతుంటే ధరలను అదుపు చేయలేని ప్రభుత్వాలు దొడ్డిదారిన విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గపు చర్యని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ట్రూఅప్ చార్జీలు పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెరిగిన వ్యక్తి బిల్లులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ  కార్యదర్శి 
నలతోటి బాబురావు, పి కొండయ్య, డి నార్పరెడ్డి, ఐవి ప్రసాదరావు, ఎం సత్యమూర్తి, కె రాజాలు, సమజ్ వాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు  సయ్యద్ బాబు, బహుజన రాజ్యం పార్టీ నాయకులు ఎస్‌కె జిలాని పాల్గొన్నారు.