ప్రజాశక్తి-పాడేరు టౌన్: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెను భారం మోపిందని, అడ్డగోలు పెంపుతో గిరిజన ప్రాంత ప్రజల నడ్డి విరిచారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ పాడేరు కుమ్మరిపుట్టులోని తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెరిగాయని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి హయాంలో 200 యూనిట్లు గిరిజన ప్రాంతంలో ఉచితంగా కరెంట్ ఇచ్చామని, వైసిపి అధికారం చేపట్టి గిరిజన ప్రాంత ప్రజల నడ్డి విరిచిందన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో సక్రమంగా పరిపాలన చేయలేని అసమర్థ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










