Aug 28,2023 20:25

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్‌ చార్జీలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం, సిపిఐ నాయకులు కోరారు. విద్యుత్‌ రంగంలో వినాశకర సంస్కరణలను వ్యతిరేకిస్తూ సాగిన మహోద్యమంలో అశువులు బాసిన రామస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌ రెడ్డికి సోమవారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు నివాళులర్పించారు. సిపిఐ, సిపిఎం పట్టణ కార్యదర్శులు సుదర్శన్‌, లక్ష్మన్న అధ్యక్షతన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశులు, సిపిఐ జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు అజరుబాబు మాట్లాడారు. విద్యుత్‌ సంస్కరణలను ప్రతిఘటించడంలో తెలుగు ప్రజలకు ఘనమైన చరిత్ర ఉందని తెలిపారు. 2000వ సంవత్సరంలో సాగిన మహోద్యమం బషీర్‌బాగ్‌ కాల్పుల్లో ముగ్గురు యువ కిశోరాలు ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. విద్యుత్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. సిపిఐ, సిపిఎం మండల కార్యదర్శులు లింగన్న, రాజు, నాయకులు లక్ష్మిరెడ్డి, యంకప్ప, ప్రకాష్‌, అంజిబాబు, ఈరన్న, గోపాల్‌, తిప్పన్న, ముక్కన్న, వీరేష్‌ పాల్గొన్నారు.