
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ భారాలు మోపితే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. విద్యుత్ అదనపు ఛార్జీలు, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు, పల్నాడు కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. గుంటూరులో ధర్నాకు సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నరసింహారావు, ఎంసిపిఐ (యు) నాయకులు కాల్వ శ్రీధర్, సిపిఐ (ఎంఎల్) నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలను ప్రజలు భరించే స్థితిలో లేరని, బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని తెలిపారు. అంధకారంలోనైనా ఉండటానికి ఇష్టపడుతున్నారన్నారు. అసలు బిల్లు కంటే అదనపు బిల్లులే ఎక్కువగా ఉంటున్నాయని, ఆఖరికి రీడింగ్ తీసే ఉద్యోగుల జీతాలు కూడా ప్రజల నుండే వసూలు చేస్తోందని విమర్శించారు. గతంలో రూ.500 వస్తే ఇప్పుడు రూ.5 వేలు బిల్లు వస్తోందని, ఇంత దుర్మార్గంగా గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం ప్రభావంతో ఆ తర్వాత అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వమూ విద్యుత్ చార్జీలు పెంచటానికి సిద్ధపడలేదని, కానీ ఈ ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా భారాలు మోపుతోందని విమర్శించారు. ప్రైవేటు కంపెనీల లాభాల కోసం చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ఏర్పడిన లోటును కూడా ప్రజల నుండి వసూలు చేస్తోందని మండిపడ్డారు. ప్రతినెలా ట్రూ ఆప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. ఒకవైపు ప్రతినెలా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తూ, మరోవైపు ధరలు పెంచి, ప్రజల నుండి అంతకు మించి వసూలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రోడ్లపైకి వస్తే అత్యంత పాశవికంగా అడ్డుకుంటున్నారన్నారు. అంగన్‌వాడీలు, ఆశాలు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవటానికి రోడ్లపైకి వస్తే పోలీసుల్ని ప్రయోగించి అడ్డుకుంటున్నారని, కొందర్ని ఇళ్ల వద్దే నిర్బంధిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇదే ధోరణి అవలంబిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్నాలో సిపిఎం జిల్లా, నగర నాయకులు వై.నేతాజి, ఎన్.భావన్నారాయణ, ఎస్.ఎస్.చెంగయ్య, ఎం.రవి, ఇ.అప్పారావు, ఎన్.శివాజీ, బి.వెంకటేశ్వరరావు, ఎం.ఎ.చిష్టీ, కె.అజరుకుమార్, బి.ముత్యాలరావు, కె.శ్రీనివాస్, సిపిఐ నగర కార్యదర్శి కె.మాల్యాద్రి పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద నుండి కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు అధ్యక్షత వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వంపై బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి సిఎం అయ్యాక ఈ నాలుగున్నరేళ్లలో అనేకసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేశారని మండిపడ్డారు. గతంలో వినియోగించిన విద్యుత్‌కు సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పుడు వసూలు చేస్తున్నారని, అసలు బిల్లు కంటే అదనపు బిల్లులే అధికంగా ఉంటున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా సమస్యలను విస్మరించి అదనపు భారాలు వేయడం అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. కేంద్రంలోని బిజెపి చెప్పినట్లు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేస్తోందని, విద్యుత్ భారాలు దాని ఫలితమేనని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్, ఎంసిపిఐ (యు) జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్‌బాష మాట్లాడుతూ కార్పొరేట్‌లకు లాభాలు చేకూర్చేందుకు స్మార్ట్ మీటర్లు తెస్తున్నారని అన్నారు. సమ్యలపై పోరాడుతున్న వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని, నిరసన హక్కులను హరిస్తున్నారని, ఈ విధానాలను మార్చుకోకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఎ.లకీëశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయులు నాయక్, జి.రవిబాబు, మాట్లాడారు. గతంలో రూ.500లోపున్న బిల్లులు ఇప్పుడు రూ.1500 వరకూ వస్తున్నాయని, బిల్లులను చూస్తేనే షాక్ కోడుతోందని అన్నారు. వినియోగించుకున్న దానికి మించి వేస్తున్న బిల్లులను ఆపేయాలని కోరారు. ఇప్పటికే నిత్యావసరాల ధలు ఆకాశానికి అంటుతున్నాయని, సామాన్యులపై విద్యుత్ ఛార్జీలు భారమై చెల్లించలేకపోతున్నారని చెప్పారు. కూలీనాలి చేసుకుని బతికేవారు తమకొచ్చే కొద్ది మొత్తాలను విద్యుత్, గ్యాస్‌కే ఖర్చు చేస్తే వారి జీవనం ఎలా గడవాలని ప్రశ్నించారు. ప్రజల రక్తాన్ని పీల్చేలా ప్రభుత్వాల భారాలున్నాయని, వీటిని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టడానికేనన్నారు. బిల్లును రైతులకు నగదు బదిలీ చేస్తామని చెబుతున్నా అది నమ్మసక్యం కాదని, గ్యాస్ సబ్సిడీ ఇందుకు నిదర్శనమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకంకు వినతిపత్రం అందజేశారు. సిపిఎం నాయకులు డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, పి.మహేష్, జి.బాలకృష్ణ, హనుమంతరెడ్డి, సిలార్ మసూద్, ఎం.ఆంజనేయులు, కె.నాగేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వరరాజు, పి.వెంకటేశ్వర్లు, జి.పిచ్చారావు, ఇ.అప్పిరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, షేక్ నాసర్‌బి, ఆంజనేయరాజు, జిలాని మాలిక్, సిపిఐ నాయకులు ఎన్.సుబ్బాయమ్మ పాల్గొన్నారు.
బిల్లులు చెల్లించలేకపోతున్నాం..
చిరు వ్యాపారి ముండ్రు వెంకటేశ్వర్లు,
విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుండడంతో చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబంపై అదనపు భారం పడుతోంది. నేను నిర్వహిస్తున్న కర్రీ పాయింట్‌కు గతంలో నెలకు రూ.2 వేలు బిల్లు వస్తే ఇప్పుడు అదే యూనిట్లకు రూ.3500పైగా వస్తోంది. చిరు వ్యాపారమే అయినా అదనపు విద్యుత్ లోడు అంటూ కొంత నగదు డిపాజిట్ చేయించుకున్నారు.
పి.పద్మ, గహిణి, రామిరెడ్డిపేట, నరసరావుపేట.
నెల నెలా పెరుగుతున్న కరెంట్ బిల్లు వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. బిల్లులు చూసి బాధపడని నెలలేదు. చాలీచాలని ఆదాయాలతో బతుకుతున్న సగటు కుటుంబాలకు విద్యుత్ బిల్లు భారంగా మారుతున్నాయి.