Sep 22,2023 21:51

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య

విద్యుత్‌ భారాలు తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : ప్రజలపై విద్యుత్‌ భారాలు తగ్గించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య పేర్కొన్నారు. శుక్రవారం 36వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో అక్కడ ప్రజలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్‌ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు విద్యుత్‌ సుంకం పేరుతో ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతుందని, మోసపూరితమైన పద్ధతులలో ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తున్నాయన్నారు. ఫిక్సిడ్‌ ఛార్జీలు కస్టమర్‌ ఛార్జీలు విద్యుత్‌ సుంకం ఇలా విడివిడిగా ప్రజలపై భారాలు వేస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా ట్రూ అప్‌ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరో బాదుడు 2021 సంవత్సరం మే లో వాడుకున్న కరెంటుకు కట్టిన బిల్లులు చాలలేదని యూనిట్‌కు 20 పైసలు చొప్పున మళ్లీ ఇప్పుడు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వాడుకున్న కరెంటుకు లోటు వచ్చిందని మరల బిల్లులలో 40 పైసలు వంతున యూనిట్‌కు పెంచినట్లు తెలిపారు. ఈ మూడు రకాల భారాలు వల్ల యూనిటీకి 80 పైసలు చొప్పున ప్రజలపై భారం పడిందన్నారు. ఇప్పటికే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం విద్యుత్‌ సంస్కరణలను రాష్ట్రంలో వ్యవసాయానికి అందించే విద్యుత్తు మొత్తం 30 సంవత్సరాలు పాటు అదాని కంపెనీ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఇప్పటికే విదేశాలలో ఉన్న బొగ్గు గనులు బొగ్గు రవాణా చేసే నౌకాశ్రయాలు ఆదానివే అని అన్నారు. సోలార్‌తో పాటు ఇప్పుడు విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు తయారు చేసే సంస్థలను అదాని కంపెనీ ప్రారంభిస్తున్నారని తెలిపారు. గతంలో కరెంటు ఛార్జీలు పెంచే అధికారం విద్యుత్‌ బోర్డుకే ఉండేది అందువల్ల విద్యుత్తు ఛార్జీలు పెంచాలంటే ప్రభుత్వాలు భయపడేవని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు సవరణ బిల్లు వల్ల రాష్ట్రంలో దళితులకు పేదలకు అందుతున్న విద్యుత్తు సబ్సిడీలు పూర్తిగా రద్దయ్యే పరిస్థితిలో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వలన ప్రజలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ప్రజలపై రకరకాల బారాలు మోపుతున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాలపై ప్రజలు సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేడ వెంకటేశ్వర్లు, స్థానికులు పాల్గొన్నారు.