
విద్యుత్ భారాలు తగ్గించాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేషకుమార్
ప్రజాశక్తి - ఆత్మకూర్
రాష్ట్రంలో విద్యుత్ భారాలను తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్ ఏ.ధనుంజయ మీటింగ్ హాల్‌లో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం పట్టణ నాయకులు ఎన్.స్వాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టి. రమేష్ కుమార్ మాట్లాడారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపడంతో అప్పుడు వామపక్ష పార్టీలు, ప్రతిపక్షాలు నిర్వహించిన ప్రజా ఉద్యమాల్లో ముగ్గురు అమరులయ్యారని, అప్పటి నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కరెంటు చార్జీలు పెంచాలంటే భయపడేవని అన్నారు. ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై పది వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు మోపిందన్నారు. వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తుందని, అందుకే విద్యుత్ భారాలు ప్రజలపైన భారీగా మోపిందన్నారు. రైతులకు పగలు పూటనే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఈ రోజు రైతుల పైన కూడా పెనుభారం మోపి మోటర్లకు మీటర్లు బిగిస్తామంటున్నారని తెలిపారు. అలాగే ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు భారం మోపుతున్నారని, గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజల నడ్డి విరచాలని చూస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు, ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాల్సి ఉన్నా అమలు చేయడం లేదన్నారు. 200 యూనిట్లలోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్‌ను అందించాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్, పట్టణ నాయకులు ఎం.రజాక్, డి.రామ్‌నాయక్, ఏ.సురేంద్ర, షేక్ ఇస్మాయిల్, జి.నాగేశ్వరరావు, సద్దాం హుస్సేన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.