ప్రజాశక్తి -అమలాపురం
పెంచిన విద్యుత్ భారాలను తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు డిమాండ్ చేశారు. సిపిఎం, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో కురసాల వారి వీధిలో సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవి గడిచినా విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయనీ ప్రతినెల చార్జీలు పెరిగిపోతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల నుండి విద్యుత్ దోపిడీ సాగిస్తున్నాయన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్లు వరకు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని వైసిపి మాట ఇచ్చి నమ్మకద్రోహం చేసిందన్నారు. వివిధ రూపాల్లో సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతోందనీ ఛార్జీల పెంపు, ట్రూ అప్, సర్దుబాటు, విద్యుత్ సుంకం, ఫిక్స్, కస్టమర్, సర్ చార్జీలు, అదనపు డిపాజిట్లు ఇలా రకరకాల పేర్లతో ప్రజలను కొల్లగొడుతున్నదనీ, ప్రతి నెలా విద్యుత్ చార్జీలు పెంచే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎసరు పెడుతున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఎస్‌టి, వృత్తిదారులకు ఇస్తున్న రాయితీలకు కోత పెడుతున్నారన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రానున్న కాలంలో సబ్సిడీ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారని, అదాని తదితర కార్పొరేట్లకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారనీ అన్నారు. తక్షణం విద్యుత్ భారాలు తగ్గించాలనీ స్మార్ట్ మీటర్లు ఆపాలన్నారు. ప్రజలంతా చార్జీల భారం తగ్గింపు కొరకు, ప్రమాదకరమైన కార్పొరేటీకరణ విధానాలు రద్దుకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అలాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కార్యచరణ తీసుకోవాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సమావేశానికి సిపిఎం జిల్లా కమిటి సభ్యులు జి.దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు పీతల రామచంద్రరావు, దైవవాణి, టి.మోహనరావు, నిమ్మకాయల వెంకటేష్, నిమ్మకాయల శ్రీనువాసరావు, పాము బాలయ్య, తాడి శ్రీరామ్ మూర్తి, బుంగ సత్యనారాయణ, తులసీరావు, ఊటాల వెంకటేష్, కంచే సత్యనారాయణ, జి.విజరు కుమార్ తదితరులు పాల్గొ న్నారు.డిమాండ్లు: 1.విద్యుత్ బిల్లులు తగ్గించాలి. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలి. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి. 2.స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలి. 3.వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిం చాలి.4.ఎస్‌సి, ఎస్‌టి, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు రాయితీని అందించాలి. 5.200 యూనిట్లు లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందిం చాలి. 6.విద్యుత్ సవరణబిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలి.










