ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామ పక్షాలు నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు బెహరా శంకర్రరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఫలితంగా రోజు రోజుకూ విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ పేద మధ్య తరగతి , పేద ప్రజానీకానికి ఆర్థిక ఇబ్బందులకు కారణమవు తున్నాయని అన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, ట్రూ అప్‌ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు పెంపు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిర్వహించే ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.సురేష్, పి.రమణమ్మ, ఎ.జగన్‌మోహన్, ఆర్.ఆనంద్, బి.రమణ, త్రినాధ్, సిపిఐ నాయకులు అప్పన్న, సిపిఐఎంఎల్ నాయకులు రెడ్డి నారాయణరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.










