Sep 02,2023 21:31

విద్యుత్‌ బిల్లుల ప్రతులను దహనం చేస్తున్న సిపిఎం నాయకులు

 కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు విద్యుత్‌ ఛార్జీల అదనపు భారం వేస్తూ మరో వైపు విద్యుత్‌ కోతలు అమలు చేయడం వల్ల సామాన్య ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, నగర కార్యదర్శి రామమోహన్‌ విమర్శించారు. శనివారం నగరంలోని పాత బస్టాండ్‌లో ఉన్న పూలే సర్కిల్‌లో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యుత్‌ యూనిట్‌ ఛార్జీలను పెంచితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని, రకరకాల పేర్లతో అదనపు భారాన్ని వేస్తున్నారని, దీనిని తక్షణమే నివారించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలు అరికట్టాలని, నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. విద్యుత్‌ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానీకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈనెల 4 న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళనలో ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కామనురు శ్రీనివాసులరెడ్డి, సత్య నారాయణ, చంద్రారెడ్డి, ఓబులేసు, ముంతాజ్‌, శ్రీనివాసులు, మల్లయ్య పాల్గొన్నారు.