
ప్రజాశక్తి-యంత్రాంగం
విద్యుత్ భారాలపై వామపక్షాల ఆధ్వర్యాన బుధవారం పలుచోట్ల నిరసన తెలిపారు.
సీతమ్మధార : వామపక్ష పార్టీల ఆధ్వర్యాన సీతమ్మధారలోని ఎపిఇపిడిసిఎల్ సిఎండి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, ఎం.పైడిరాజు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని విద్యుత్ దోపిడీ సాగిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్లు వరకు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని వైసిపి మాట ఇచ్చి నమ్మకద్రోహం చేసిందన్నారు. చార్జీల పెంపు, ట్రూ అప్, సర్దుబాటు, సుంకం, ఫిక్స్‌డ్, కస్టమర్ చార్జీలు, సర్ చార్జీలు, అదనపు డిపాజిట్లు అంటూ రకరకాల పేర్లతో భారాలు వేస్తున్నారని విమర్శించారు. ప్రతి నెలా విద్యుత్ చార్జీలు పెంచే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. రైతుల ఉచిత విద్యుత్‌కు ఎసరు పెడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఇస్తున్న రాయితీలకు కోత పెడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రానున్న కాలంలో సబ్సిడీ ఎత్తివేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారని, అదాని తదితర కార్పొరేట్లకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారని చెప్పారు. మీటర్లు రైతులు, వినియోగదారుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయని వివరించారు. ముందుగానే విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రీపెయిడ్ విధానం ప్రవేశపెట్టి, స్మార్ట్ మీటర్లకయ్యే ఖర్చును వినియోగదారులే భరించాలని కుట్ర పన్నుతున్నారని, రాత్రిపూట వినియోగించుకునే కరెంటుకు అదనపు బిల్లులు వేసే ప్రమాదకర విధానం తెస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, కార్పొరేట్లకు పూర్తిగా లొంగిపోయిందని విమర్శించారు. గతంలోని ప్రభుత్వాలు అడ్డగోలుగా బడా కంపెనీలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామని మాట ఇచ్చిన వైసిపి నేడు అదే బాటలో ప్రయాణిస్తోందని తెలిపారు. గతంలో వాడుకున్న విద్యుత్‌కు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దుచేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలని, విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ ఆర్‌కెఎస్‌వి.కుమార్, కె.సత్యనారాయణ, వై.రాజు, పి.చంద్రశేఖర్, ఎం.కృష్ణారావు, సిఎన్.క్షేత్రపాల్, లక్ష్మణరావు, జి.రాంబాబు, ఎం.సుబ్బారావు, జిఎస్‌జె.అచ్యుతరావు, కె.సత్యాంజనేయ, బి.ఈశ్వరమ్మ, ఎమ్‌డి బేగం, రమణి, వనజాక్షి, కుమారి, దేముడమ్మ పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆపరేషన్స్ డైరెక్టర్ బి.రాధాకృష్ణమూర్తికి అందజేశారు.
తగరపువలస : సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చిట్టివలస లేబర్ వెల్ఫేర్ సెంటర్ నుంచి తగరపువలస జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తగరపువలస జంక్షన్‌లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు భాగం లక్ష్మి, కె.రాంబాబు మాట్లాడారు.
అనకాపల్లి : ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలు రద్దు చేయాలని సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శంకర్రావు మాట్లాడుతూ విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఎన్ భద్రం, దొరబాబు, విజయలక్ష్మి, సిపిఎ నాయకులు గంటా శ్రీరామ్, వివి.శ్రీనివాసరావు, జి నాయనబాబు, సుభాషిణి, బి.ఉమామహేశ్వరరావు, బుగిడి నూకప్పారావు పాల్గొన్నారు.