Oct 17,2023 00:50

సిపిఎం కంచరపాలెం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన నిరసన తెలుపుతున్న వామపక్ష కార్మికులు

ప్రజాశక్తి - యంత్రాంగం
కలెక్టరేట్‌, సీతమ్మధార : వైసిపి ప్రభుత్వం ప్రజలు, రైతులపై వేసిన విద్యుత్‌ భారాలను రద్దు చేయకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం, సిపిఐ నాయకులు హెచ్చరించారు. సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గ్రీన్‌పార్కు వద్ద ఉన్న ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ కేంద్ర బిజెపి తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలు - 2022 చట్టాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం వేగవంతంగా అమలు చేసి ప్రజలపైనా, రైతులపైనా మోయలేని భారాలు మోపుతోందని మండిపడ్డారు. వర్షాకాలం వచ్చినా విద్యుత్‌ బిల్లులు భారీగా వస్తున్నాయని, ప్రతి నెలా ఛార్జీలు పెరిగిపోతున్నాయని తెలిపారు. అదానీకి విద్యుత్‌ కంపెనీలను కట్టబెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్లు వరకు అందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి చెప్పారని, ఆ తర్వాత మోడీకి తొత్తుగా మారిపోయారని విమర్శించారు. విద్యుత్‌ మీటర్లకు ఆధార్‌ లింక్‌ పెట్టి అదనపు డిపాజిట్లుకు పూనుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతినెలా విద్యుత్‌ ఛార్జీలు పెంచే విధానాన్ని ప్రవేశపెట్టారని, రైతుల ఉచిత విద్యుత్తుకు ఎసరు పెడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ వృత్తిదారులకు ఇస్తున్న రాయితీలకు కోత పెడుతున్నారని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రానున్న కాలంలో సబ్సిడీ ఎత్తివేయాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారని, అదానీ తదితర కార్పొరేట్లకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారని తెలిపారు. విద్యుత్‌ భారాలను పెంచుకుంటూపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, క్షేత్రపాల్‌, ఎ.విమల, కె.కుమారి, ఎం.సుబ్బారావు, పి.చంద్రశేఖర్‌, ఎస్‌కె.రెహిమాన్‌, వి.నరేంద్రకుమార్‌, వై.రాజు, జి.రాంబాబు, పి.శంకరరావు, ఎమ్‌డి.భేగం, పి.వెంకటరావు, ఎం.మన్మధరావు, దేముడమ్మ పాల్గొన్నారు.
ములగాడ : మల్కాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద సిపిఎం మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. సిపిఎం మల్కాపురం జోన్‌ నాయకులు కె.పెంటారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జోన్‌ నాయకులు సత్యారావు, ఎల్‌.కృష్ణ, పివి.భాస్కరరావు, కృష్ణారావు, నరేష్‌, అర్జునరావు, వై.గంగాధర్‌, పైడిరాజు, ప్రేమ్‌రాజు, నీలయ్య, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : సిపిఎం గాజువాక జోన్‌ కమిటీ ఆధ్వర్యాన చినగంట్యాడ సబ్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఎఇకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, వై.లక్ష్మణరావు, దాసరి అప్పారావు, గొలగాని అప్పారావు, పివైవి.రమణారావు, కె.కిరీటం, కె.సంతోషం, పెదగంట్యాడ సిపిఎం నాయకులు బైరెడ్డి గురప్ప, కెపి.కుమార్‌ పాల్గొన్నారు.
మాధవధార : సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన కంచరపాలెం మెట్టు వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కంచరపాలెం జోన్‌ కార్యదర్శి బొట్టా ఈశ్వరమ్మ, బి.పద్మ, ఒ అప్పారావు, ఎస్‌.సోమేశ్వరరావు, పి.వెంకటరావు, పి.రామారావు, శారద, శ్రీనివాసరావు, కూన వెంకట్రావు, వాసుపల్లి నల్లయ్య, సిపిఐ నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.