
ప్రజాశక్తి-యంత్రాంగం
విద్యుత్ భారాలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యాన సోమవారం పలుచోట్ల కరపత్రాల పంపిణీ, ధర్నా తదితర కార్యక్రమాలు చేపట్టారు.
మధురవాడ : మధురవాడ సిపిఐ కార్యాలయం నుంచి మార్కెట్ ఏరియా స్వతంత్రనగర్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, దుకాణాలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని విద్యుత్ దోపిడీ సాగిస్తున్నాయని విమర్శించారు. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలని, ఎస్సీ, ఎస్టీలు, వత్తిదారులకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు రాయితీని అందించాలని, 200 యూనిట్లు లోపు పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలని, విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచారంలో సిపిఐ మధురవాడ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, కొల్లి మేఘారావు, జి.వేళంగినిరావు, పిళ్ళా అప్పన్న, పెంటపల్లి కాంతమ్మ, షేక్ కాలిషా, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : జివిఎంసి 63వ వార్డు పరిధి క్రాంతినగర్, చింతలలోవలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సత్యాంజనేయ, రాంబాబు, గండి అప్పారావు, ఎన్‌వి.త్రినాథ్, కనకరాజు, డి.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : కొత్త గాజువాక కూడలి వద్ద సిపిఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, జి.ఆనంద్, తాండ్ర కనకరాజు, కె.అచ్యుతరావు, పల్లేటి పోలయ్య, పప్పు అప్పారావు, సోమేష్, వై.దేముడు, కె.వనజాక్షి, పిల్లా సూర్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : ఆరిలోవ సిపిఐ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌కె.రెహ్మాన్, దేవుడమ్మ, కాసుబాబు, చిరంజీవి, కె.సందీప్‌కుమార్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.