ప్రజాశక్తి-సింగ్‌నగర్: ప్రజలపై సర్దుబాటు ఛార్జీల పేరుతో మోపిన భారాలపై ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు విమర్శించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో సిపిఎం నాయకులు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను నాయకులకు చూపిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల కూడా అధికంగా బిల్లులు వచ్చాయని వాపోయారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలపై భారాలు మోపుతున్నాయనానరు. ప్రజల ఆందోళనపై సిఎం జగన్ స్పందించకుండా మౌనం వహిస్తున్నారని, ఈ వైఖరి విడనాడకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత నెల వేసవి కారణంగా విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని భ్రమపడిన ప్రజలకు ఈ నెల కూడా షాక్ తగిలిందన్నారు. మూడు రకాల సర్దుబాటు ఛార్జీలతో జులై నెల విద్యుత్ బిల్లులు వచ్చాయన్నారు. 2014-19 వరకు వినియోగించుకున్న విద్యుత్‌కు వరుసగా 12వ నెల యూనిట్‌కు 20 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు కొనసాగించారని, మరో 24 నెలల పాటు ఇవి కొనసాగనున్నాయని తెలిపారు. 2021 జూన్‌లో వినియోగించుకున్న విద్యుత్తుకు మరో 20 పైసలు చొప్పున ఈ నెలలో కూడా సర్దుబాటు ఛార్జీలు మోపారన్నారు. 2023 మేలో వినియోగించుకున్న విద్యుత్‌కు 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందన్నారు. గతంలో వినియోగించుకున్న విద్యుత్‌కు నేడు యూనిట్‌కు 80 పైసలు చొప్పున వసూలు చేయడం దారుణమన్నారు. పేదవారిపై, అద్దెదారులపై ఈ భారం అధికంగా ఉందన్నారు. ఇవి చాలవన్నట్లు కార్పొరేట్ల లాభాల కోసం స్మార్ట్‌మీటర్లు బిగించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ భారాలపై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే పౌర సమాజంతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.రమణరావు, కె.దుర్గారావు, సిహెచ్.శ్రీనివాస్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.










