Jul 03,2023 00:55

నిరసనలో పాల్గొన్న ముఠా కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ అదనపు భారాలు రద్దు చేయాలని సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె.నళినీకాంత్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం గుంటూరు నగర ముఠా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆదివారం మస్తాన్‌దర్గా సెంటర్‌లోని టింబర్‌ ముఠా కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు విద్యుత్‌ కంపెనీల నుండి కనీసం 10 శాతం విద్యుత్తు కొనుగోలు చేయాలని కేంద్రం విధించిన నిబంధనలతో అధిక చార్జీలు చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేసి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు తక్కువ ధరకు మంచి బొగ్గును అందజేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి విదేశీ బోగ్గు కొనుగోలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలపై ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో భారాలు మోపటం ఎందుకని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ సంస్కరణలు అదానీ, కార్పోరేట్‌లకు లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో అదానీ కంపెనీకి లాభాలు చేకూర్చేందుకు రూ.13 వేల కోట్లు ప్రజలపై భారాలు మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, స్మార్ట్‌ మీటర్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలపై మోపే అదనపు భారాలను తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఎస్‌.కె కాసిం షహీద్‌, టింబర్‌ ముఠా మేస్త్రి వెంకటేశ్వర్లు, హుస్సేను, ముఠా కార్మికులు పాల్గొన్నారు.