ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల పేరుతో వేసిన రూ.6వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలను విడనాడాలని వామపక్షాల ఆధ్వర్యాన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎల్‌బిజి భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శంకర్రావుతో పాటు సిపిఐజిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు బెహరా శంకర్రరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఫలితంగా రోజు రోజుకూ విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ పేద మధ్యతరగతి, పేద ప్రజానీకానికి ఆర్థిక ఇబ్బందులకు కారణ మవుతున్నాయని అన్నారు. పెరిగిన ధరలు తగ్గించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, ఎస్సీ,ఎస్టీ లకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కొనసాగించాలని, ప్రజా ఉద్యమాలు పై నిర్బంధాన్ని ఆపాలని కొరుతూ 27న కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ , మహిళా సమాఖ్య అధ్యక్షులు భాయి రమణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.రమణ, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి భూషణం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్. ఆనంద్, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం,నాయకులు పాల్గొన్నారు.










