Jul 02,2023 00:46

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌, తాడేపల్లి రూరల్‌ : విద్యుత్‌ భారాల రద్దు కోసం మంగళగిరి మండలం నిడమర్రు చెరువు కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో, తాడేపల్లి మండలం కుంచనపల్లి విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద శనివారం నిరసన చేపట్టారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, నాయకులు ఎం.భాగ్యరాజు, సీనియర్‌ నాయకులు జొన్న శిశంకరరావు, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం తలోగ్గి అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలను బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అమలు చేస్తోందని మండిపడ్డారు.మే నెల బిల్లులో ఉపయోగించిన విద్యుత్‌కు బిల్లు మాత్రమే కాకుండా మరో ఆరు రకాల అదనపు ఛార్జీలను వేశారని, పదేళ్ల కిందట ఉపయోగించుకున్న విద్యుత్‌ పై ఇప్పుడు ఇంధన సర్దుబాటు చార్జీలు చెల్లించాలంటున్నారని మండిపడ్డారు. ఇవి సరిపోనట్టు కార్పొరేట్‌ శక్తులతో కొమ్మక్కై ఆదాని స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రీపెయిడ్‌ మీటర్లకు డబ్బులను రానున్న పదేళ్లపాటు 120 నెలలు వినియోగదారుల నుండి వసూలు చేసేందుకు ప్రభుత్వం పథకాన్ని సిద్ధం చేసిందని, ఇవేగాక ప్రతినెలా విద్యుత్‌ ఛార్జీలు సవరించాలనే కేంద్ర ప్రభుత్వ విధాన అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని మండిపడ్డారు. ప్రైవేటు విద్యుత్‌ సంస్థలతో చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలను రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యుత్‌ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రక్రియను మొదలుపెట్టారని, వీటివల్ల రైతులు నష్టపోతారని చెప్పారు. నాయకులు కె.ప్రకాశరావు, కె.శీను, సాంబయ్య, ఎ.రంగారావు, పి.కృష్ణ, జి.శ్రీనివాసరావు, ఎ.సుబ్బారావు, బి.మోహనరావు, కె.హరీష్‌, ఎ.అర్జునరావు, టి.అభి, జి.ప్రవీణ్‌, ఎన్‌.నవీన్‌, ఎం.వంశీ, బి.రమేష్‌, ఎం.దిలీప్‌ పాల్గొన్నారు.