ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 27వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టాలని వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణచైతన్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తదితరులు మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలకు కరెంటు నిత్యాసర వస్తువుగా మారిందని, అలాంటి విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి షరతులకు లొంగి విద్యుత్‌రంగాన్ని ప్రయివేటు పరం చేస్తుందని విమర్శించారు. దానిలో భాగంగా ప్రజలపై ట్రూ అప్, సర్దుబాటు, సర్వీసు, అదనపు చార్జీలు అంటూ రకరకాల పేరుతో భారాలు మోపారని విమర్శించారు. అంతేకాకుండా అదానీ కంపెనీకి కాంట్రాక్టులు ఇస్తూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని చూస్తుందని, అంటే ఇకమీదట సెల్ ఫోన్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకున్నట్లు కరెంటుకు కూడా ముందుగానే డబ్బులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండి వసూలు చేయాలని చూస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సంస్క రణల వల్ల రైతులకు, ఎస్‌సి, ఎస్‌టిలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తివేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీలు, రాయితీలను తొలగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీలు ఉద్యమించటం సహజమని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఉద్యమాలు చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతను అరెస్టు చేసిన తీరు అభ్యంతరకరమన్నారు. అక్రమ అరెస్టులు, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు కార్యదర్శి పి.కిషోర్, సిపిఐ ఏలూరు కార్యదర్శి హేమశంకర్, ఐఎఫ్‌బియు నాయకులు బద్ద వెంకట్రావు, బిఎంకెయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీని వాస్, మహిళా సంఘం నాయకులు ఇందిర, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడారు. కెవిపిఎస్ నాయకులు ఎం.ఇస్సాక్, సిఐటియు నాయకులు కోటేశ్వరరావు పాల్గొన్నారు.










