హిందూపురం : వివిధ రకాల ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలను మోపి సామాన్య ప్రజానీకం నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఆపకపోతే మరో విద్యుత్ ఉద్యమానికి సన్నద్ధం అవుతామని రాజకీయ ఐక్య వేదిక నాయకులు తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు, విద్యుత్ ఛార్జీలు పెంపు, సర్ధుబాటు, ట్రూ అప్ ఛార్జీలు పెంపు సరైనది కాదని వీటికి నిరసిస్తూ శనివారం ఐక్య వేదిక ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిని ఇచ్చారు. ఈ సందర్బంగా పెంచిన ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నాయకులు ప్రభుత్వనికి హెచ్చరించించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిందన్నారు. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్లాబులు కుదించటంతో విద్యుత్ వినియోగదారులపై విపరీతమైన భారాలు పడుతున్నాయన్నారు. ఒక పక్క పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సతమతం అవుతుంటే ఇళ్లకు, షాపులకు ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి కనెక్షన్‌కు రూ.13 వేలు భారం వినియోదారులపై పడుతుందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలవల్ల లఘు, కుటీర పరిశ్రమలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. జోన్ల కింద విభజించి ఒక్కొక్కరికి ఒక్కో రేటు వసూలు చేయడానికి రంగం సిద్దం చేయడం దారుణమని అన్నారు. వీటిని తక్షణమే ఉపసంహరించకపోతే ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలను ఏకంచేసి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్యామ్ కిరణ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు శ్రీరాములు, గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు ఏ శ్రీనివాసులు, ఎంఐఎం పార్టీ నాయకులు మున్న, ఎంఎస్‌ఎఫ్ రవికుమార్, వివిధ పార్టీల నాయకులు కలీం, హరి, హనుమంతరాయుడు, ఉమర్, పైరోజ్, నూరుల్లా, ఆలీ, దాదు, తిమ్మక్క, కష్ణవేణి, రామాంజినేయులు, రవి, ఈశ్వరయ్య, హరిష్ పాల్గొన్నారు.










