ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
వివిధ పేర్లతో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించి వినియోగదారులపై భారం మోపడాన్ని ఆపాలని, 2020 కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఏలూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద సంతకాల సేకరణ ప్రారంభించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించొద్దని, విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు నశించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య ప్రసంగిస్తూ ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతూ, ఇబ్బంది పడుతున్న ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలు మోపడం దారుణమని వారు ఆరోపించారు. బిజెపి తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయకముందే మన రాష్ట్రంలో సిఎం జగన్ హడావుడిగా అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ఆరు రూపాల్లో విద్యుత్ భారాలు మోపుతున్నారని పేర్కొన్నారు. 2014లో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు ఛార్జీలు వసూలు చేయడం దారుణమని విమర్శించారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించి, ఫోన్ రీఛార్జి లాగా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే గాని విద్యుత్ వాడుకోలేని విధంగా కొత్త విధానం తీసుకొస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని వారు తెలిపారు. ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ పది వామపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఫ్లెక్సీపై సంతకాలు చేసి ప్రారంభించారు. అనేకమంది సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సెక్రటరీ బండి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు బి.సోమయ్య, బి.జగన్నాధరావు, వి.సాయిబాబు, విఎన్.ప్రసాద్, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, డి.వీరినాయుడు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి చల్లారి మాణిక్యాలరావు, సిపిఐ మండల కార్యదర్శి జెవి.రమణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్‌టిసి బస్టాండ్ సమీపలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వంగా గోపి, ఆరేటి రామచంద్రరావు, ఎస్‌కె.మహబూబ్‌సుభాని, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుంచె వసంతరావు, మండల కమిటీ సభ్యులు గొలిమే బాలఏసు, తాళ్లూరి నాగరాజు, హనుమంతు, గట్టయ్య, ఆశీర్వాదం, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
కొయ్యలగూడెం:విద్యుత్ భారాలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం పట్టణంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కట్టా మహాలక్ష్మయ్య, ఆకుల దుర్గారావు, కడియం సీతారాములు, ఎస్.శివకుమార్, ఇ.గోపి, రాచూరి దుర్గారావు, మర్రి త్రిమూర్తులు, పిల్ల తంబారావు పాల్గొన్నారు.










