విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కావాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
రాయచోటి టౌన్ : కార్పొరేట్ల జేబులు నింపడం కోసం మోడీ, జగన్ జోడీ ప్రభు త్వాలు ప్రజలను దోచుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీని వాసులు విమర్శించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ పరిధిలో గురు వారం విద్యుత్ పోరుబాట పేరుతో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపటం దారుణమన్నారు. అప్పుల కోసం వైసిపి ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్కరణలకు దాసోహం అవడం శోచనీయమన్నారు. ప్రపంచంలో సోలార్ విద్యుత్ రేట్లు యూనిట్‌కు రూ.1.50లకు పడిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రజలపై విద్యుత్ భారం తీవ్రంగా ఉందని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, అదనపు లోడ్ డిపాజిట్లు, అదనపు కస్టమర్ ఛార్జీలు వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. విద్యుత్ బిల్లులు పరిశీలిస్తే అసలు బిల్లు 5 శాతం ఉంటే, సర్దుబాటు చార్జీలు 82 శాతం, ఇతర చార్జీలు 13 శాతం ఉంటున్నాయని వివరించారు. స్మార్ట్ మీటర్ల వల్ల కార్పొరేట్ కంపెనీలకు తప్ప ప్రజలకు ప్రయోజనం ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ, జగన్ కలసి సామాన్యుల నడ్డి విడుస్తున్నారని, చిరువ్యాపారుల నుండి చిన్న పరిశ్రమల వరకూ ప్రతిఒక్కరూ బాధితులేనని తెలిపారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని పట్టణాల్లో వర్తక, వాణిజ్య సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, పౌర సంఘాలతో కలిసి జూన్ 30న ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే, బాదుడని విమర్శించిన సిఎం జగన్మోహన్‌రెడ్డి బాదుడులో అందరిని మించిపోయారని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలతో కార్పొరేట్ కంపెనీలు బాగుపడ్డాయని, విద్యుత్ రంగం నాశనం అయ్యిందని, ఫలితంగా ప్రజలపై తీవ్రమైన భారాలు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని, అందుకోసం ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా జరుగు ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామచంద్ర, డి.సి.వెంకటయ్య, కాలనీ వాసులు రామచంద్ర, వేణు, వెంకటరమణ, రమణమ్మ పాల్గొన్నారు.










