ప్రజాశక్తి - చిలకలూరిపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ట్రూ అప్ సర్దుబాటు చార్జీలు వసూలును నిలిపేయాలని, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరేంద్రకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ అధ్యక్షత వహించగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ల జేబులు నింపడానికి జనంపై విద్యుత్ భారాలు మోపుతున్నారని, వివిధ ఛార్జీల పేరుతో దాదాపు రూ.50 వేల కోట్ల భారం వేస్తున్నారని మండిపడ్డారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. ప్రజలకు నష్టం చేసే విధానాలను కేంద్రం తెస్తుంటే వాటిని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు అందులో భాగమని చెప్పారు. ఉచిత విద్యుత్‌ను నీరుగార్చి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. పాలకులు, కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కై రూ.రెండుకు కొనాల్సిన యూనిట్‌ను రూ.10-12కు కొంటు న్నారని, ఇటీవల హిందూజా కంపెనీకి రూ.1200 కోట్లు అదనపు చార్జీల పేరుతో ప్రభుత్వం చెల్లించిందని విమర్శిం చారు. ఈ విధానాల నుండి వెనక్కు తగ్గకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అనంతరం ఇతర నాయకులు మాట్లాడారు. సిపిఐ ఏరియా కార్యదర్శి ఎన్.సుబ్బాయమ్మ, సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎస్.బాబు, ఎం.విల్సన్, టి.ప్రతాప్‌రెడ్డి, శాంసన్, పి.భారతి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి షేక్ జరినా సుల్తానా, లోక్‌సత్తా నాయకులు ఎం.భానుప్రసాద్, నవతరం పార్టీ అధ్య క్షులు ఆర్.సుబ్రమణ్యం, జనసేన నాయ కులు టి.రాజారమేష్, వివిధ సంఘాల నాయకులు షేక్ అల్లాబక్షు, ఎ.మోహన్, టి.బాబురావు, సిహెచ్. నిర్మల, బి.భగత్ సింగ్, లలితకుమారి, ఎస్.లూథర్, బి.శేషయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఇఇ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ మోడీ చెప్పుల్లో కాళ్లు పెట్టి జగన్ నడుస్తున్నారని విమర్శించారు. మోడీ ఆదేశాలతో విద్యుత్ ఛార్జీలను పెంచుతు న్నారని, అదాని, అంబానిలకు కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ఆందోళనను ఉద్రృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టరు వై.రామచం ద్రారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులునాయక్, నాయకులు బి.మహేష్, సిపిఐ నాయకులు ఎం.బాబురావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అమరావతి : మండల కేంద్రమైన అమరావతిలోని పాత లారీ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెపడంతోపాటు విద్యుత్ బిల్లులను దహనం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడారు.










