కడప : విద్యుత్ కార్యాలయానికి వచ్చిన ఫైళ్లను ఎప్పటికప్పుడూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని, విద్యుత్ బకాయిలపై దృష్టి సారించి వసూళ్లుచేయాలని విద్యుత్ ఎస్‌ఇ రమణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడప విద్యుత్‌భవన్‌లోని తన ఛాంబర్‌లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సక్రమంగా పనిచేయని వారిపై శాఖ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ రకాల రోజువారి పనుల పురోగతిపై పరిశీలించాలని తెలియజేశారు. విద్యుత్ సేవలకు సంబంధించి అనుమతులు యుద్ధ ప్రాతిపదికన జారీ అయ్యేవిధంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యాలయంలో ఎవరి వద్దా ఫైళ్లు పెండింగులో ఉండకూడదని హెచ్చరించారు. ఈ-ఆఫీస్ పద్ధతి ద్వారా పనులు చేయాలని ఆదేశించారు. పని చేయని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించ వద్దని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిపాలన, అకౌంట్స్, టెక్నికల్ విభాగం వారు పాల్గొన్నారు.










