Aug 24,2023 21:20

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ బిల్లులు తగ్గించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ విమర్శించారు. గురువారం నగరంలోని సిపిఎం నగర కార్యాలయంలో 'సమరభేరి' పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు రూ.13 లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ, నూరు లక్షల కోట్లు అప్పులు చేస్తూ, పేద ప్రజలపై పన్నులు భారాన్ని మోపు తుందని చెప్పారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజ లపై భారాలు వేసి ఆదాయాలు రాబట్టాలని ఆదేశాలు జారీచేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం, సరళీకరణ విధానాలను అమలు చేయకపోతే అప్పుకి అనుమతి ఇచ్చేదిలేదని అమెరికా బెదిరింపులకు లొంగిపోయిందని పేర్కొన్నారు. ఈ విధానాలను జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించకుండా అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని మార్క్సిస్టు పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. ప్రజలను పీడిస్తున్న అధిక ధరలు, రోజురోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు, అదుపు లేకుండా ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజానీకం ధరల కోరల్లో చిక్కుకు పోతున్నారని, మోడీ గద్దెనెక్కిన వెంటనే రూ.450 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ .1200 కు పెరిగిందని, పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలు అంతులేకుండా పెరుగుతూనే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేదలకు ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు క్రమేపి తగ్గించి ఎత్తేయాలని చూస్తోందని పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు వివిధ రూపాలలో ఆందోళనకు సిపిఐ(యం) పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి, కె. శ్రీనివాసులు రెడ్డి, వి.అన్వేష్‌ పాల్గొన్నారు.