Sep 23,2023 20:58

సమావేశంలో మాట్లాడుతున్న సి పి ఎం జిల్లా నాయకులు నాగరాజు

విద్యుత్‌ బారాలు తగ్గించాలి
- స్మార్ట్‌ మీటర్లు బిగించడం నిలిపివేయాలి
- 27న ధర్నాను జయప్రదం చేయండి
- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - నంద్యాల

     రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బారాలు తగ్గించాలని, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం నిలిపివేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 27న నంద్యాల కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శనివారం నంద్యాలలోని సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.నాగరాజు, సిపిఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రఫీ హాజరై మాట్లాడారు. 2002లో టిడిపి ప్రభుత్వం రూ. 750 కోట్లు ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపిందని, అప్పుడు వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని పిలుపునిచ్చిందని తెలిపారు. నాడు అధికారంలో చంద్రబాబు నాయుడు లాఠీ చార్జ్‌ చేయించి, కాల్పులు జరిపించడంతో ఎందరో వామపక్ష పార్టీ నాయకులు అమరులైనారని, లాఠీ చార్జీలకు గురయ్యారని చెప్పారు. దాంతో చంద్రబాబు నాయుడు మళ్లీ 10 సంవత్సరాల వరకు అధికారంలోకి రాలేదన్నారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వమైనా కరెంటు చార్జీలు పెంచాలంటే భయపడేవని, కానీ ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజల పైన రూ. 10 వేల కోట్ల విద్యుత్‌ భారాలు మోపారని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తుందని, అందుకే విద్యుత్‌ భారాలు భారీగా మోపారన్నారు. రైతులకు పగలు పూటనే ఉచిత విద్యుత్‌ ఇస్తానని, ఈ రోజు రైతులపై కూడా పెనుభారం మోపి మోటర్లకు మీటర్లు బిగిస్తానంటున్నారని, ట్రూ ఆఫ్‌, సర్దుబాటు చార్జీలు పేరుతో వేల కోట్ల రూపాయల భారం మోపారని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని చూస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించాల్సి ఉన్నా అమలు చేయడం లేదన్నారు. 200 యూనిట్ల లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్తును అందించాలని, విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నంద్యాల కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు బాబా ఫక్రుద్దీన్‌, తోట మద్దులు, ప్రసాద్‌, కెఎండి గౌస్‌, దొమ్మరి శ్రీనివాసులు, రామరాజు, డీ లక్ష్మణ్‌, వెంకట్‌ లింగం, శివ, ఓ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.