![](/sites/default/files/2023-11/glp%20mandal_0.jpg)
ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ప్రతిసారి నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాలకు ఉన్నత అధికారులు హాజరు కావాల్సి ఉండగా కింది స్థాయి సిబ్బందిని పంపించి సమావేశాలకు డుమ్మా కొట్టడం ఎంతవరకు సమంజసమని ఎంపిపి కె. దీనమయ్య ప్రశ్నించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి దీనమయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన విద్యుత్తు, ఆర్టీసీ శాఖల పనితీరు సరిగ్గా లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపిపి జోక్యం చేసుకొని ఆర్టీసీ సేవలు ఏజెన్సీలో నామమాత్రంగానే ఉన్నాయన్నారు. గతంలో లప్పటి, పి.ఆమిటి గ్రామాలకు బస్సులు నడిపే వారని, ప్రస్తుతం సర్వీసు లేదని కారణంతో రద్దు చేయడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇదే సమస్యను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందించలేదని మండిపడ్డారు. సర్వసభ్య సమావేశానికి డిఎం స్థాయి అధికారి రావాల్సి ఉండగా కింది స్థాయి సిబ్బందిని పంపిస్తే సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో మూడు, నాలుగు నెలలుగా రావడం లేదని ఎంపిటిసి కడ్రక మల్లేశ్వరరావు తెలిపారు. ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న డుమ్మంగి పంచాయతీ కేంద్రానికి వచ్చి బయోమెట్రిక్ వేసి నిత్యవసర సరుకులు తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగు, తాగునీరు తదితర శాఖలపై సమీక్ష జరిగింది. కార్యక్రమంలో వైస్ ఎంపిపిలు నిమ్మక శేఖర్, ఎం.లక్ష్మణరావు, జడ్పిటిసి ఎం.రాధిక, రజక కార్పొరేషన్ డైరెక్టర్ జి.గిరిబాబు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.