విద్యుత్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
- జిల్లా వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
ప్రజాశక్తి - నంద్యాల
బషీర్ బాగ్ విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల త్యాగాలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో విద్యుత్ అమర వీరుల సంస్మరణ సభ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు అధ్యక్షతన జరిగింది. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా టి.రమేష్ కుమార్ మాట్లాడారు. 2000 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మీద రూ. 750 కోట్లు విద్యుత్ భారం మోపారని, ఆ భారాలను మోయలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ నేపథ్యంలో సిపిఎం ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపునకు లక్షలాదిమంది వచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు విద్యుత్ బారాలు తగ్గించకుండా హైదరాబాద్ బషీర్ బాగ్ దగ్గర కాల్పులు జరిపించి, లాఠీలతో కొట్టించి బాష్పవాయువు ప్రయోగించారని అన్నారు. కాల్పుల్లో సిపిఎం నాయకులు కామ్రేడ్స్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అమరులైనారని అన్నారు. వందలాదిమంది కార్యకర్తలకు లాఠీ ఛార్జికి గురయ్యారని తెలిపారు. ఆ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2002లో కూలిపోయిందన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆయన ఉన్నంతకాలం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రైతులకు, దళితులకు ఉచిత కరెంటు ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు ఆయన వారసుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలపై రూ. 10 వేల కోట్లు విద్యుత్ బారాలు మోపారని అన్నారు. దళితులకు ఉచిత కరెంటు తీసేశారని, రైతులకు 9 గంటలు పగలు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి మాట మార్చారని తెలిపారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని చూస్తున్నారని అన్నారు. ప్రజల మీద ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకుతింటున్నారని విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పట్టణాలలో, గ్రామాలలో ఈ నెల 30, 31న ప్రజల దగ్గర సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1న అన్ని సచివాలయాల ముందు ధర్నా, 3న నిరుద్యోగ సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం, 4న అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలందరూ మద్దతిచ్చి పాల్గొనాలని కోరారు. అనంతరం సిపిఎం సీనియర్ నాయకుడు తోటమద్దులు, జిల్లా నాయకులు మస్తాన్‌వలి మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రాజశేఖర్, సుధాకర్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కెఎండి గౌస్, వెంకట లింగం, డి.లక్ష్మణ్, పట్టణ నాయకులు ఓ.లక్ష్మణ్, శివ, జైలాన్, హరి, కృష్ణ, కిరణ్, మార్కు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.










