Aug 28,2023 20:10

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యుత్‌ అమరవీరుల పోరాటాలు ఊరికే పోనివ్వబోమని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి, కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు తెలిపారు. సోమవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో విద్యుత్‌ పోరాట అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం మండల నాయకులు హనుమంతు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను తిప్పి కొట్టాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచుతూ రైతులు, ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విద్యుత్‌ చట్టాలు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఒక యూనిట్‌కు 45 పైసల చొప్పున విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నాయని చెప్పారు. మొబైల్‌కు రీచార్జీ ఎలా చేయించుకుంటామో అలా విద్యుత్‌ మీటర్లకు బిగిస్తూ నెలకు విద్యుత్‌ రీచార్జీ చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఆగస్టు 28, 2000వ సంవత్సరంలో టిడిపి పాలనకు వ్యతిరేకంగా, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని బషీర్‌బాగ్‌లో జరిగిన ఉద్యమం ఎప్పటికీ మర్చిపోలేనిదని చెప్పారు. రాబోయే కాలంలో విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ ఎంఎల్‌ నాయకులు రాజు, ఎంఎల్‌ పార్టీ సంజీవ్‌, నరసింహులు, ఐఎఫ్‌టియు సత్తన్న, బాలరాజు, సిపిఎం జిల్లా నాయకులు గోవిందు, సిఐటియు నాయకులు రాముడు, అబ్దుల్లా, రాజు, కెవిపిఎస్‌ నాయకులు ఆంథోని, డివైఎఫ్‌ఐ నాయకులు సురేష్‌, రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, రాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.