Oct 07,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

కడప అర్బన్‌ : రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలకు తిలోదకాలిచ్చి ఎడా పెడా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై పెనుభారాన్ని మోపుతోందని వామపక్ష సంఘాల నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్‌ ప్రవేటీకరణ బిల్లుకు మద్దతిచ్చి, షరతులను శరవేగంగా అమలు చేస్తూ విద్యుత్‌ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టి కార్పోరేట్‌ కంపెనీలకు కట్టబెట్టాలనే దుశ్శాహసానికి ఒడిగట్టిందని వాపోయారు. విద్యుత్‌ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ వావపక్షాలు తలపెట్టిన దశల వారి ఆందోళనలో భాగంగా ఈనెల 9 నుంచి 15 వరకు జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు రానున్న కాలంలో కూడా పెంచబోమని నమ్మబలికారని చెప్పారు. తరువాత 7 సార్లు కరెంటు చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్‌ నిరాటంకంగా అందిస్తానని చెప్పి నేడు నిరంతరం కోతలు ప్రజలపై వాతలు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1కోటి 89 లక్షలమందికి ఫ్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించి రూ.13,500కోట్లు వధా ఖర్చులతో ప్రజలపై బాదుడుకు సిద్ధమయ్యారని చెప్పారు. 2019-20 సంవత్సరానికి గాను రూ.670 కోట్లు ఇప్పుడు వసూలు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సిపిఐ ఎం.ఎల్‌ లిబరేషన్‌ డబ్ల్యూ రాము, సిపిఐ ఎంఎల్‌ రమణయ్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ జయవర్ధన్‌ ఆర్‌ఎస్పీ సుబ్బరాయుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేసీబాదుల్ల, సిపిఎం నగర నాయకులు డి ఎం ఓబులేసు, సి. ఆర్‌. వి. ప్రసాద్‌ రావు పాల్గొన్నారు.