Jul 06,2023 00:55

దీక్షల్లో ఎంసిపిఐయు కార్యకర్తలు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ప్రజలపై విద్యుత్‌ భారాలను రద్దు చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. భారాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు చేసే ఉద్యమాలకు సిపిఎం ఎల్లప్పుడూ మద్దతుగా నిలవడంతోపాటు పోరాటంలోనూ భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిలా కేంద్రమైన నరసరావుపేట స్టేషన్‌ రోడ్‌లోని స్థానిక గాంధీ పార్క్‌ వద్ద ఈనెల 10 తేదీ వరకు నిర్వహించే రిలే నిరాహార దీక్షలు బుధవారం ప్రారంభమాయ్యాయి. మొదటి రోజు దీక్షను ఎంసిపిఐ (యు) చేపట్టగా దీక్షలను ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కోశాధికారి డి.శివకుమారి పూలదండ వేసి ప్రారంభించారు. విజరుకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూచనలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014 నుండి 2019 వరకు 2021 ఏడాదికి సంబంధించి విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ భారాలపై అన్ని ప్రజా సంఘాలు ఏకమై పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాలు సైతం =వ్యవసాయ మోటార్లకు మీటర్లు స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియను తిరస్కరించాయని వైసిపి ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలో తూచ తప్పకుండా అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత కాలనిలకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ అంటూ మోసం చేశారని, వేలకు బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు, లాభాలు చేకూర్చేందుకు స్మార్ట్‌ మీటర్ల విధానం తీసుకువచ్చిందని, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించి ఉచిత విద్యుత్‌ పథకానికి మంగళం పాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఎంసిపిఐ (యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి తుమాటి శివయ్య మాట్లాడుతూ పల్నాడు పౌర హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ సంస్కరణలు పేరిట అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు. విద్యుత్‌ సంస్కరణల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్ధతులు మార్చుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, జైభీమ్‌ భారత్‌ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు జి.జాన్‌పాల్‌ ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి షేక్‌ మోహిద్దీన్‌ బాషా, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమాటి మణికంఠ, కుమారి, ఎం.నాగేశ్వరరావు, చంద్రకళ పాల్గొన్నారు.