
ప్రజాశక్తి - తెనాలి : విద్యుద్ఘాతంతో కౌలురైతు మృతి చెందిన ఘటన మండలంలోని కఠెవరంలో మంగళవారం వెలుగు చూసింది. రూరల్ ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుల్లెట్ గోపయ్య(52) సోమవారం పొలానికి వెళ్లి గడ్డి కోస్తున్నాడు. అక్కడే పడి ఉన్న విద్యుత్ తీగను గమనించకపోవడంతో, అతను ఉపయోగిస్తున్న కొడవలి ఆ తీగకు తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం వరకూ గోపయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వెళ్లి పరిశీలించగా విషయం వెలుగు చూసింది. ఘటనపై వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.