Oct 11,2023 23:29

ప్రజాశక్తి - అచ్చంపేట : మిర్చి పొలానికి నీరు పెడుతూ విద్యుత్‌షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని చిగురుపాడులో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మర్రి గంగయ్య (52) తన సొంత పొలంతోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. పైరుకు నీరు పెట్టేందుకు ఉదయాన్నే పొలానికి వెళ్లిన గంగయ్య మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడు. మోటారు స్విచ్‌ను ఆన్‌ చేస్తుండగా షాక్‌ రావడంతో పెద్దగా అరుస్తూ కుప్పకూలాడు. గమనించిన పక్క పొలంలోని రైతులు వచ్చి పరిశీలించగా గంగయ్య అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.