మరో ఇద్దరికి గాయాలు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
విద్యుత్ షాక్‌కు గురై భవన నిర్మాణ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడారు. ఈ ఘటన మండలంలోని నాగులగూడెంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నాగులగూడెంలో గోలి శ్రీనివాసరెడ్డికి చెందిన భవన నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం శ్లాబ్ పనులు చేపట్టారు. శ్లాబ్ పని ముగిసిన తర్వాత భవనం కింద నుంచి పైకి మెటిరీయల్ తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన పోల్స్‌ను పనుల్లో పాల్గొన్న తప్పెళ్ల నాగరాజు(33)తో పాటు మరికొంత మంది తొలగిస్తున్నారు. పోల్స్‌ను తొలగించే క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగలింది. దీంతో నాగరాజు, పత్తిపాటి వెంకటరావు, మంగమూరి నాగరాజు విద్యుత్ షాక్‌కి గురయ్యారు. ఘటనా స్థలంలోనే తప్పెళ్ల నాగరాజు మృతి చెందాడు. వెంకట్రావు, ముంగమూరి నాగరాజు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెంలో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నాగరాజు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతినీడిపాలేనికి చెందిన భవన నిర్మాణ కార్మికుడుగా గుర్తించారు. అతనికి వివాహమై రెండేళ్లు అయింది. భార్య శిరీష, ఇద్దరు మగపిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










