Oct 18,2023 00:19

సబ్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ధర్నా చేస్తున్న గొల్లలపాలెం గ్రామస్తులు

ప్రజాశక్తి-పద్మనాభం : విద్యుదాఘాతానికి గురైన మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధి గొల్లలపాలెం గ్రామానికి చెందిన లైన్‌మ్యాన్‌ హెల్పర్‌ దువ్వువిష్ణుకు న్యాయం చేయాలని గ్రామస్తులు మంగళవారం సబ్‌స్టేషన్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 14న విష్ణుకు లైన్‌మ్యాన్‌ రాధాకృష్ణ ఫోన్‌ చేసి కోళ్ల ఫారం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పైన వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్‌ లైన్‌ సరిచేయాలని చెప్పారని తెలిపారు. ఆ సమయంలో ఎల్‌సి తీసుకోకుండా లైన్‌మ్యాన్‌ పని చేయించడంతో విష్ణు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడని గ్రామస్తులు ఆరోపించారు. అప్పటి నుంచి లైన్‌మ్యాన్‌ పరారీలో ఉన్నాడని, నాలుగు రోజులు అవుతున్నా ఆయన విద్యుత్‌ శాఖాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సబ్‌ స్టేషన్‌లో ఉన్న సబ్‌ ఇంజినీర్‌ రమేష్‌ మాట్లాడుతూ, లైన్‌మ్యాన్‌ను విధుల నుంచి తొలగించామని, ఆయనపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేశామని వివరించారు. విష్ణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జి.పెద్దఎర్రినాయుడు, రవి, సత్యనారాయణ, చంద్రరావు, శివ తదితరులు పాల్గొన్నారు.