Jun 18,2023 00:32

విద్యార్థులతో కలెక్టర్‌, ఎంపి, ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి-పాడేరు: విద్యతోనే సమాజం అన్ని రంగాలలో అభివద్ధి చెందుతుందని, విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక కాఫీ హౌస్‌ లో పాడేరు శాసన సభ్యురాలు కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా 2023 సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యతోనే గిరిజన ప్రాంతం రూపు రేఖలు మారతాయన్నారు. వ్యవస్థలో మార్పుకు విద్య దోహద పడుతుందని అన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తే తలిదండ్రులకు గౌరవం.. పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు బయట ప్రపంచంపై అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు.
అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ... విద్యార్థుల ఉన్నత ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాకాలు అందిస్తోందన్నారు. నాడు నేడులో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గిరిపుత్రులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఐఎఎస్‌, ఐపిఎస్‌, అధికారులుగా ఎదగాలన్నారు. చదువుకునే సమయంలో ఉత్తమ క్రీడా కారిణిగా తనకు మూడు వందల చెక్కు నెల నెలా వచ్చేదన్నారు.
ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోందన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మన బడి నాడు నేడులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు మెరుగు పడ్డాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలలు నెలకొల్పడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఆంగ్ల భాషా విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అరకు శాసన సభ్యులు శెట్టి పాల్గుణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను జగనన్న ఆణిముత్యాల పేరిట సత్కరించడం గొప్ప విషయ మన్నారు. వసతి దీవెన, విద్యా దీవన సర్వినియోగం చేసుకోవాలన్నారు.
ఐటిడిఏ పి.ఓ వి.అభిషేక్‌ మాట్లాడుతూ, చదువుతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని చెప్పారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థితికి ఎదగా లన్నారు. ట్రైకార్‌ చైర్మన్‌ శతక బుల్లి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శ మన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు, ఇన్చార్జి డి ఇ ఓ అప్పారావు, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్‌.రజని, జెడ్పీటిసి బొంజుబాబు, పాడేరు సర్పంచ్‌ కె.ఉషారాణి పాల్గొన్నారు.
విద్యార్థులకు నగదు పురస్కారాలు
ప్రజాశక్తి-పాడేరు: 2022-23 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో వివిధ యాజమాన్యాల పాఠశాలలు. . చదువుకుని పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగనన్న ఆణి ముత్యాల పేరిట ఘనంగా అవార్డులు, నగదు పురష్కారాలు అందించి శనివారం స్థానిక కాఫీ ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి, శాసన సభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ట్రైకార్‌ చైర్మన్‌ శతక బుల్లి బాబు, పాడేరు సర్పంచ్‌ కె. ఉషారాణి చేతుల మీదగా సత్కరించారు. 5 మంది విద్యార్థులకు ప్రధమ బహుమతి కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు, నలుగురు విద్యార్థులకు ద్వితీయ బహుమతి కింద ఒక్కరికి రూ.40 వేలు చొప్పున, ద్వితీయ బహుమతి కింద ఒక్కరి రూ.30 వేల చొప్పున నలుగురికి సగదు. బహుమతిని ప్రతిభా పత్రాలు, మెడల్స్‌తో సత్కరించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఒక్కరికి రూ.50 వేల చొప్పున 12 మంది విద్యార్ధులకు అందించి సత్కరించారు. 10వ తరగతిలో ఉత్తమ అవార్డులు పలువురు విద్యార్థులు పొందారు.