May 26,2023 22:48

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు ప్రస్ఫుటంగా కన్పిస్తోందని, విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందనే జగనన్న ఆలోచనకు ఇది నిదర్శనమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. జంగారెడ్డిగూడెంలో రూ.7.55 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల భవనాన్ని శుక్రవారం స్థానిక ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివద్ధికి ప్రతియేటా బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు సిఎం జగన్‌ కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు కన్పిస్తోందన్నారు. ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ ఈ నెల 30న చింతలపూడిలో నిర్వహించనున్న జాబ్‌మేళాలో పాల్గొనేందుకు పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో కళాశాల విద్య అభ్యసించిన వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరుస్తున్నామన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మంత్రి విశ్వరూప్‌, ఎంఎల్‌ఎ ఎలిజా, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.ఝాన్సీరాణి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బత్తిన నాగలక్ష్మి, జెడ్‌పిటిసి బాబ్జి, ఎంపిపి జ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ భవానిప్రసాద్‌, తహశీల్దార్‌ స్లీవ్‌ జోజి, ఎఎంసి ఛైర్‌పర్సన్‌ జానకీరెడ్డి, మహిళా శిశుసంక్షేమ రీజినల్‌ కోఆర్డినేటర్‌ సాయిబాల పద్మ, కళాశాల ప్రిన్సిపల్‌ సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.