Jul 28,2023 23:11

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డిఇఒ జ్యోతికుమారి

ప్రజాశక్తి - రణస్థలం: ప్రతి విద్యార్థికీ విద్యతో పాటు క్రమశిక్షణ అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.జ్యోతికుమారి అన్నారు. మండలంలోని లంకపేట కెజిబివి పాఠశాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఆటలు, పాటలు, వ్యాయామం తదితర వాటిపై ఆసక్తి కలిగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిఆర్‌పిలను విద్యార్హతలను బట్టి సిఆర్‌ఎంటిలుగా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సిఆర్‌ఎంటి విధులతో పాటు సిఆర్‌పిలుగానూ విధులు నిర్వహించాలని తెలిపారు. సింగిల్‌ టీచర్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లినప్పుడు ఆయా పాఠశాలలకు వెళ్లేటప్పుడు విద్యా ప్రమాణాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎంఆర్‌సి నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంఇఒ ఎ.త్రినాథరావు, సిఆర్‌పిలు ఆర్‌.పాపినాయుడు, యు.శ్రీనివాస్‌, జె.శ్రీనివాస్‌, వై.యోగానంద్‌, ఎస్‌.రామకృష్ణ, జి.రామకృష్న, జి.గౌరినాయుడు తదితరులున్నారు.