ఎయిడెడ్ విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సు, జిఓల పర్యవసానంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు, సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకుల భవిష్యత్తు అగమ్యగోచరం ఔతోంది. రాష్ట్ర రాజధానిగా వున్న విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రస్తుతం పదేసి డిగ్రీ కాలేజిలు ఎయిడెడ్‌వి కాగా ప్రభుత్వం ఒక్కొక్కటి మాత్రమే నిర్వహిస్తోందంటే వాటి విస్తృతి ఎంతో తేటతెల్లం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలవల్ల నష్టపోతున్న బాధితులు ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టారు. ఒకవైపు 1,2 తరగతుల పిల్లల్ని అంగన్‌వాడీలతో విలీనం చేస్తామని, 3,4,5 తరగతుల విద్యార్థులను సమీప హైస్కూళ్లకు తరలిస్తామని ప్రాథమిక విద్యలో పెను పునర్వ్యవస్థీకరణకు తెర లేపిన సర్కారు మరోవైపున ఎయిడెడ్ వ్యవస్థనూ చిందరవందర చేయజూడడం దారుణం. ఇప్పటికే కరోనా విపత్తు మూలంగా ఇబ్బందుల సుడిలోనున్న విద్యా వ్యవస్థకు అదనపు సహకారం అందించి బలోపేతం చేయవలసిన ప్రభుత్వం ఆ పని మాని మరింత గందరగోళ పర్చడం తగదు.
రాష్ట్ర విద్యారంగ పరిణామంలో ఎయిడెడ్ వ్యవస్థకున్న ప్రముఖ స్థానాన్ని విస్మరించ వీలులేదు. జాతీయోద్యమ కాలంలోనే ఇందుకు పునాది పడింది. సంపన్నులకు, అగ్ర కులాల వారికి పరిమితమైన గురుకుల విద్య ఒకవైపు బ్రిటిష్ వారి పాలనకు అవసరమైన గుమాస్తాలను తయారుచేసే విద్య మరోవైపు ఉన్న నేపథ్యంలో సామాన్యులకు విద్యనందించే లక్ష్యంతో జాతీయోద్యమ స్ఫూర్తితో కొందరు దాతలు విద్యాలయాలు స్థాపించారు. సమాజంలో విద్యా వ్యాప్తికి దోహదపడడంతోపాటు ఎంతోమంది యువతీ యువకులు ఆ విద్యాలయాల నుండే జాతీయోద్యమం లోకి ఉరికిన విషయం అందరికీ తెలిసిందే! సర్ సి.వి. రామన్ వంటి విశ్వ విఖ్యాత మేధావులెందరో ఈ ఎయిడెడ్ సంస్థల నుండే ఎదిగారు. జాతీయోద్యమంలో ప్రగతిశీల పాత్ర చేపట్టి, విద్యారంగం అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న అట్టి విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయాలన్న కాంక్షతో స్వాతంత్య్రానంతరం మన ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందించడం, అందుకు చట్టాలు, నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగాయి. అన్నిటినీ మార్కెట్ శక్తులకు వదిలేసి ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉండాలన్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాక ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం సన్నగిల్లడం, ఖాళీ అయిన ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఎయిడెడ్ వ్యవస్థ ఇబ్బందుల పాలైంది.
విద్య ఇటు ప్రభుత్వం లేదా అటు ప్రైవేటు రంగంలోనే ఉండాలితప్ప మధ్యేమార్గం లేదన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం కొత్త సమస్యలకు కారణమవుతోంది. ఎయిడెడ్ విద్యాసంస్థలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రకటిస్తే ఎవరికీ ఎలాంటి కష్టం రాదు. కాని అలా చేయడంలేదు. కాబట్టి అవి ప్రైవేటు పరమైతే ఇప్పుడు నామమాత్రమైన ఫీజుతో విద్య పొందుతున్న లక్షలాదిమంది విద్యార్థులు ఇకపై ఎంతెంత మొత్తాలు చెల్లించాలి? సామాన్య కుటుంబాలకు, బడుగు బలహీనవర్గాలకు విద్య అందుతుందా? అన్నది పెద్ద ప్రశ్న. ఎయిడెడ్ పోస్టుల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం తీసుకుంటానంటోంది కాని అన్ ఎయిడెడ్ పోస్టుల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న వేలాదిమంది భవిష్యత్తేమిటి? విద్యా హక్కు చట్టం పిల్లలకు అందుబాటులో స్కూలు నెలకొల్పడమేగాక వారికి విద్యను బోధించేందుకు సుశిక్షితులైన ఉపాధ్యాయులూ ఉండాలని స్పష్టంగా పేర్కొంది. మరి అవన్నీ దూరం చేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని కూడా ధిక్కరిస్తుందా? యుజిసి, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులతో ఎయిడెడ్ సంస్థల్లో నిర్మించిన భవనాలు, పరిశోధనాలయాలు, స్టేడియాలు వగైరా ఇప్పుడు ఎవరికి చెందుతాయి? ప్రజల సొత్తును ఆయా ప్రైవేటు యాజమాన్యాలకు దఖలు పరుస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానాలు చెప్పాలి. హడావుడి నిర్ణయాలతో విద్యా వ్యవస్థను గందరగోళపర్చడం మాని ప్రాథమిక విద్యా వ్యవస్థను, ఎయిడెడ్ విద్యా సంస్థలనూ యథాతథంగా కొనసాగించాలన్నది జనవాక్యం. ప్రభుత్వానికి అదే శిరోధార్యం కదా!










