Apr 01,2023 00:45

మాట్లాడుతున్న మంత్రి నాగర్జున

ప్రజాశక్తి - యలమంచిలి
వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొక్కిరాపల్లి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలను సందర్శించారు. సిబ్బంది, విద్యార్ధులతో ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు- నేడు పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని, నాణ్యమైన భోజనం, విద్యార్థులకు టాబ్‌లు, యూనిఫారం అందిస్తున్నామని తెలిపారు. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మంత్రికి వినతి పత్రం అందజేసి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటకృష్ణతార, ఎంపిపి బోదెపు గోవింద్‌, మాజీ ఎంపిపి బొద్దపు ఎర్రయ్యదొర, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బెజవాడ నాగేశ్వరరావు, కౌన్సిలర్‌ దూది నరసింహమూర్తి, సిఐ గఫూర్‌, ఎస్‌ఐలు సన్నిబాబు, ఈశ్వరరావు పాల్గొన్నారు.
నక్కపల్లి:గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్య మెరుగుపడిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాగర్జున మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యాభివద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు.నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం జరిగిందన్నారు. మౌలిక వసతులతో కూడిన విధంగా పాఠశాలల నిర్మాణాలను సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు .కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టల్లు ఉన్నాయని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం ద్వారా బోధించడం జరుగుతుందన్నారు.విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగే విధంగా విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. సమయం వృధా చేయకుండా కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందించాలన్న సంకల్పంతో స్వయంగా సీఎం జగన్‌ మెనూ రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, సర్పంచ్‌ జయ రత్నకుమారి, ఎంపీపీ రత్నం, జడ్పిటిసి కాసులమ్మ, డిసిఓ రూపవతి, ఎంపీడీవో సీతారామ రాజు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, వైసిపి నాయకురాలు శేషారత్నం, ఉపసర్పంచ్‌ రాజు పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్‌ స్థలం పరిశీలన
నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌ స్థలాన్ని శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పరిశీలించారు. సర్వే నెంబర్‌ 322/1బి లో 3 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్‌ సంబంధించిన స్థలం ఉంది. ఈ మేరకు స్థలానికి సంబంధించిన మ్యాప్‌ ను తహసిల్దార్‌ నీరజ మంత్రికి చూపించారు. స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు .