Feb 07,2023 22:44

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
          ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి అనేక పథకాలు అమలు చేస్తున్నారని, విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లో బి.ఫార్మసీ భవనం, మహిళా హాస్టల్‌ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు రావాలని జాతీయ విద్యావిధానం అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచస్థాయిలో విజయాలు సాధించేలా ఉన్నత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్‌ కోర్సులపైనా శిక్షణ ఇస్తున్నామన్నారు. నన్నయ యూనివర్సిటీ హాస్టల్లో వసతులు 15 రోజుల్లోగా పూర్తిస్థాయిలో సమకూర్చాలని రిజిస్ట్రార్‌కు సూచించారు. రూ.ఐదు కోట్లతో యూనివర్సిటీకి వచ్చే రోడ్డు పనులు చేపట్టాలని ఆయన సూచించారు. కళాశాలలో సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేస్తే పరిష్కరిస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌కు రూ.150 కోట్ల విలువైన భూములను గతంలో కేటాయించినట్లు తెలిపారు. క్యాంపస్‌కు సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎం.ఫార్మసీ, ఎంకాం, ఎంసిఎ, ఎంఎస్‌సి డేటా ఎనాలసిస్‌ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆయన విద్యాశాఖ మంత్రిని కోరారు. తాడేపల్లిగూడెంలో మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలను కూడా మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ జివి.ప్రసాదరాజు, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ జెవి.మురళీ, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అశోక్‌, ప్రిన్సిపల్‌ రమేష్‌, భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు పాల్గొన్నారు.