Nov 04,2023 21:03

బొబ్బిలి: పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు

ప్రజాశక్తి- బొబ్బిలి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 8న జరగనున్న విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ నాయకులు మణికుమార్‌, రవికుమార్‌, కె.అప్పన్న కోరారు. బంద్‌ వాల్‌పోస్టర్లను శనివారం విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
నెల్లిమర్ల: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్‌ 8న జరిగే విద్యాసంస్థల బంద్‌ని జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌ కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బంద్‌ను జయప్రదం చేయాలని శనివారం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వెంకటేష్‌ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, విశాఖ ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో నవంబర్‌ 8న బంద్‌ చేపట్టి, విద్యార్థి లోకాన్ని ఐక్యం చేసి విద్యార్థి ఉద్యమాల ద్వారా విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని చెప్పారు. కడప ఉక్కుని సాధించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె.రవి కుమార్‌, విద్యార్థులు పవన్‌ కుమార్‌ , రవి తదితరులు పాల్గొన్నారు.