Nov 08,2023 21:24

పార్వతీపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు

పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ పిలుపుమేరకు చేపట్టిన బంద్‌లో కెజి టు పిజి వరకు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రయివేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ ప్రకటించాయి. బంద్‌ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా పార్వతీపురం, పాలకొండ పట్టణాల్లో విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టారు.
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ 


బంద్‌ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు.. కాలేజీ నుంచి కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజు, హెచ్‌.సింహాచలం, పిడిఎస్‌ఒ జిల్లా ఉపాధ్యక్షులు కె.సోమేష్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటం బుధవారంతో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. బిజెపి విధానం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. రాష్ట్రానికే వెన్నెముకగా నిలిచిన ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని బిజెపి ప్రభుత్వం ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మహేష్‌, సురేష్‌, మాధవ, సోమేష్‌, ప్రకాశ్‌, సూర్య, సురేంద్ర, శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : విద్యాసంస్థల బంద్‌ కురుపాం మండలంలో సంపూర్ణమైంది. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. శోభలతాదేవి కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి తెరిచి ఉన్న పాఠశాలలను ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మూసివేయించారు. విద్యార్థులను ఇళ్లకు పంపించారు.
పాలకొండ : పాలకొండ పట్టణంతోపాటు మండలంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. బంద్‌ సందర్భంగా పాలకొండలో పలు కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.పండు మాట్లాడుతూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్టీల్‌ ప్లాంట్‌ను చవకగా కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కుట్రలను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. ఉక్కు కార్మిక సంఘాలు వెయ్యి రోజులుగా దీక్షలు చేపడుతున్నా ప్రధాని
మోడీ స్పందించక పోవడం చాలా దుర్మార్గమ న్నారు. ఎన్నికలలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సూర్య, అనిల్‌, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.
సాలూరు : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. పట్టణంలో, మండలంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు అఖిల్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిలిపివేయాలని, కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.