Nov 08,2023 21:49

క్యాంపస్‌లో... వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో

భావి పౌరుల భవిష్యత్‌ కోసం తలపెట్టిన...


విద్యాసంస్థల బంద్‌ సక్సెస్‌




ప్రజాశక్తి - క్యాంపస్‌, యంత్రాంగం
భావిపౌరుల భవిష్యత్‌ కోసం విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయరాదని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ బుధవారం జయప్రదమయ్యింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని తలపెట్టిన ఉద్యమం వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. తిరుపతి బాలాజీకాలనీలో మానవహారం నిర్వహించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.జయచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి చలపతి, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు ఆదిలి మాట్లాడుతూ విద్యార్థి, యువజన నాయకులు 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని అన్నారు. కరోనా కష్టకాలంలో లక్షల మందికి ఆక్సిజన్‌ అందజేసి ప్రాణాలు నిలబెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టాలన్న ఆలోచన దుర్మార్గమన్నారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుప గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ కోసం ఐక్య ఉద్యమాలు చేస్తామన్నారు. రెండుసార్లు సిఎం జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసినా ఆచరణలో పురోగతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.సుమున్‌, సురేష్‌, చరణ్‌, చందు, నవీన్‌, భాస్కర్‌, రవి, అక్బర్‌, సుందర్‌రాజు, ఓంరాజ్‌, హరిక్రిష్ణ, వినరు పాల్గొన్నారు. క్యాంపస్‌లో... వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.మాధవ్‌, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఆదిశేషు, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు సుందర్‌, పిడిఎస్‌ఒ నాయకులు ఆర్‌.ఆశ, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు మల్లికార్జున నాయకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుమొకగా ఉంటూ లాభాలు తెచ్చే విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయరాదంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరిత, వినోద్‌, నిత్య, రామాంజి, అజరు, సునీల్‌, వెంకటేష్‌, భవాని, సాయి, కిరణ్‌, కుమార్‌ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు యువ, మోహన్‌ , పిడి ఎస్‌ యూ నాయకులు మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో... బంద్‌ విజయవంతమయ్యింది. విద్యాసంస్థలు ఎక్కడికక్కడ స్వచ్ఛంతంగా మూతబడ్డాయి. విద్యార్థిసంఘాల నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు సంగనపల్లి సురేష్‌, ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కత్తి రవి, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి జాకీర్‌ సంయుక్తంగా నిరసన చేపట్టి బంద్‌ను జయప్రదం చేశారు. పుత్తూరులో... ఎఐఎస్‌ఎఫ్‌, సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. ఆర్‌డిఎం గేటు సర్కిల్లో ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సును ఆపి బంద్‌కు సహకరించాలని కోరారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సిపిఎం జిల్లా నాయకులు ఆర్‌.వెంకటేష్‌, సిపిఐ నాయకులు మహేష్‌లను అరెస్టు చేసి, సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. వరదయ్యపాళెంలో...కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ విజయవంతమయ్యింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాషా పాల్గొన్నారు.