
* స్వచ్ఛందంగా సెలవు ప్రకటించిన
యాజమాన్యాలు
* పలుచోట్ల ర్యాలీలు
* ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టుకు
పోలీసుల విఫలయత్నం
* బంద్‌కు మద్దతు పలికిన
సిపిఎం, సిపిఐ
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, పలాస, టెక్కలి రూరల్, ఇచ్ఛాపురం : విశాఖ ఉక్కువిశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ఆపాలి, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విద్యా రంగ సమస్యల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ నేపథ్యంలో పలు ప్రయివేట్ విద్యా సంస్థలు ముందు సెలవు ప్రకటించాయి. బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించాయి. టెక్కలిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టుకు పోలీసులు విఫలయత్నం చేశారు. బంద్‌కు సిపిఎం, సిపిఐ మద్దతు తెలిపాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రాజు, నాయకులు దుర్గాప్రసాద్, ఉమామహేష్, తరుణ్ పలు ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు వెళ్లి బంద్‌కు సహకరించాలని కోరారు. దీంతో వారు స్వచ్ఛందంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. మరోవైపు పోలీసులు విద్యా సంస్థలకు వెళ్లి విద్యార్థులను విడిచిపెట్టొదని, పంపిస్తే కేసులు పెడతామంటూ యాజమాన్యాలను హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులు కళ్లు గప్పి విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రయివేట్‌పరం చేయడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా అంతా అడ్డుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం విద్యా రంగ సమస్యలను గాలికొదిలేసిందన్నారు. సంక్షేమ వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఇంటర్, డిగ్రీ కోర్సులకు పెంచిన ఫీజులను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఉర్జాన దుర్గాప్రసాద్ కమిటీ సభ్యులు ఉమామహేష్, తరుణ్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్ నాయకులు పలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి బంద్‌కు సహకరించాలని కోరారు. దీంతో పలు విద్యా సంస్థలు విద్యార్థులను ఇళ్లకు పంపేశాయి. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్, సంతోష్, రాజు, నితిన్, భూపతి, మణికంఠ, ఎఐవైఎఫ్ నాయకులు యుగంధర్ పాల్గొన్నారు.
విద్యార్థి, యువజన సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఎఐఎస్‌ఎఫ్, డివైఐఎఫ్, ఎఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యాన పలాస జూనియర్ కళాశాల నుంచి ఇందిరాగాంధీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వినోద్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును మోదీ ప్రభుత్వం పోస్కో కంపెనీకి కట్టబెట్టాలని చూస్తోందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జి.వాసుదేవరావు, గుణశేఖర్, పవన్, చందు, జీవన్, సునీల్ పాల్గొన్నారు. సిపిఎం నాయకులు ఎం.గణపతి, సిపిఐ నాయకులు చాపర వేణు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు.