Nov 08,2023 21:37

ఫొటో : బంద్‌ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, విద్యార్థి సంఘాల పిలుపుమేరకు బుధవారం ఆత్మకూరులో విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా నిర్వహించారు. విద్యార్థి సంఘం సభ్యులు పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలను మూసివేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ కన్వీనర్‌ ఖాదర్‌ బాషా, కోకన్వీనర్‌ చక్రి మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడమే పనిగా చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రుల ఆస్తిగా ఉంటున్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరణను చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ఖనిజాలను రాష్ట్ర ఆస్తిని ప్రజలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము ఆత్మకూరు పట్టణంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహించినట్లు తెలిపారు. ముందస్తు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని కొన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ టౌన్‌ కన్వీనర్‌ ఖాదర్‌ బాషా, కో కన్వీనర్‌ చక్రి, ఎఎస్‌ఐఎఫ్‌ టౌన్‌ సెక్రెటరీ యస్దాని, తదితర సభ్యులు హాజరయ్యారు.