ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, పలాస : అధిక ఫీజుల నియంత్రణ, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, విద్యా, వసతి దీవెన డబ్బులు జమ తదితర డిమాండ్లతో టిఎన్‌ఎస్‌ఎఫ్ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలగ ప్రహర్ష ఆధ్వర్యాన టిఎన్‌ఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ (ఆలిండియా యూత్ ఫెడరేషన్) నాయకులు శ్రీకాకుళం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలను మూయించారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలలు యదావిధిగా పనిచేశాయి. విద్యార్థి సంఘ నాయకులు వస్తారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న నాయకులు కళాశాల బంద్ ప్రయత్నాలను విరమించుకుని వెనక్కి వెళ్లిపోయారు. బంద్ పిలుపుతో కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. పలాసలో టిఎన్‌ఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు జంట పట్టణాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయించారు.
అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి
విద్యారంగంలో నెలకొన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలగ ప్రహర్ష డిమాండ్ చేశారు. షరతు లేకుండా అమ్మఒడి పథకాన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇవ్వాలన్నారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలన్నారు.వసతి గృహ విద్యార్థులకు పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రెడ్డి శంకర్, జి.వాసుదేవరావు, ఎఐవైఎఫ్ నాయకులు శ్రీను, రవి, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు సిహెచ్.రవి, పవన్, చందు తదితరులు పాల్గొన్నారు.










