ప్రజాశక్తి-పాడేరు : గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని యుటిఎఫ్ నేతలు కోరారు. మంగళవారం గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐ.కొండలరావుకు ఈ మేరకు యుటిఎఫ్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వి మహేశ్వరరావు, కార్యదర్శి కె.రఘునాథ్ వినతిపత్రం అందజేశారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గణితం, సైన్స్, ఇంగ్లీష,్ హిందీ సబ్జెక్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, సిఆర్‌టిల బకాయి వేతనాల చెల్లింపు, హెచ్‌ఎంలకు 2021-22 వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. అలాగే పాఠశాలలకు అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని విద్యార్థులకు ట్రంక్‌పెట్టెలకు అందజేయాలని కోరారు. కిల్లోగుడ ఆశ్రమపాఠశాల పేరుతో నిర్మించిన భవనాలను ఆ పాఠశాలకే కేటాయించాలని కోరారు.










